Total Pageviews

Sunday, December 27, 2015

ఎంత మోహమో కాని ఇతడు నీమీదను - సంతతము బాయకిటు సరుసనున్నాడు [Enta mohamogani itadu nee meedanu]

//ప// ఎంత మోహమో కాని ఇతడు నీమీదను 
సంతతము బాయకిటు సరుసనున్నాడు

//చ// పలుకవే పతితోడ పగడవాతెర దెరచి 
చిలుకవే సెలవులను చిరునవ్వులు 
మొలకసిగ్గులివేల మోనంబులింకనేల 
కలయికకు వచ్చి ఇదె కాచుకొన్నాడు 

//చ// కనుగొనవె వొకమాటు కలువకన్నుల నితని
పెనగవే కరములను ప్రియము చల్లి
పొనిగేటి తమక మేల పొసగిగుట్టిక నేల
నినుగదియువేడుకను నిలుచున్నవాడు 

//చ// కొసరవే యీవేళ కూరిములు సారెకును
విసరవే సణగులిటు వేమారును
వెసరతుల మరిగి శ్రీవేంకటేశుడు గూడి
సుసరమున నీతోడ జొక్కుచున్నాడు

ముఖ్యపదాల అర్ధం:
సంతతము= ఎల్లప్పుడూ
పాయక= విడువక
సరుస= పక్కన
పగడవాతెర తెరచి: వాయి అంటే నోరు అని అర్ధం. అంటే, పగడాలవంటి ఎర్రని పెదవులచే మూసిఉంచిన నోటిని తెరచి
సెలవులను: పెదవి మూలలనుంది వచ్చే నవ్వులు
మోనంబు= మౌనములు
పెనగు=మెలిగొను To be twisted
పొనిగు=తేజములేని, చల్లారిన
పొసగు= ఇముడు, ఒప్పు, చక్కగా
సణగు: గొణుగు To grumble, to mutter
కూరిమి= స్నేహం
సారెకు= మాటిమాటికీ
వెస= త్వరగా, శీఘ్రముగా
సుసరము: నిశ్వాస  [From Skt. స్వరః] n. Breath. శ్వాసము, ముక్కుగాలి.
చొక్కు= To enjoy oneself to excess పరవశము

భావం:
 శ్రీవారిపై గల సిగ్గుతో అమ్మవారు ఆయనకు సరిగా సహకరించటంలేదని, శ్రీవారికి ఆమె అంటే ఎంత మోహమో తెలియజెప్పి, యే విధంగా ఆయనతో మాటామంతీ కలిపి, ఆయనకు సహకరించి, ఆయన్ను సంతోషపెట్టమని -చెప్తున్నట్టుగా ఉంది ఈ శృంగార సంకీర్తన. 

//ప// అమ్మా! నీ మీద శ్రీవారికి ఎంత మోహం ఉందో కానీ, ఎప్పుడూ విడువకుండా నిన్నే అంటిపెట్టుకుని ఉన్నాడు. 

//చ//  నీ ఎర్రని పగడపు అధరాలను అలా మూసి ఉంచకుండా, కొంచెం ఆ తెరని తెరచి మీ ఆయనతో కొన్ని తియ్యని పలుకులు పలకవమ్మా!. 
నీ పెదవి మూలలనుండి వచ్చే సున్నితమైన నవ్వులను ఆయనపై చిలకవమ్మా!
ఆయన్ను చూడగనే ఆ సిగ్గులెందుకు మొలుస్తున్నాయి? ఈ సమయంలో ఆ మౌనం దేనికి? ఇవన్నీ ఉండవచ్చునా ఈ సమయంలో? నీతో కలయికకు స్వామి వచ్చి, నీకోసమై కాచుకుని కూర్చున్నాడు. 

//చ//  కలువ కన్నుల స్వామి ఒకసారి ఎక్కడున్నాడో చూడవమ్మా!  
కొంచెం ఇష్టాన్ని చూపిస్తూ ఆయను నీ బాహువుల మధ్య మెలిపెట్టవే. 
ఈ ఉద్రేకంలేని కోరికలేలమ్మా! [అమ్మవారి ప్రవర్తన చప్పగా ఉందని కవి భావన]
ఇద్దరూ కలిసినప్పుడు అలా గుటకలు మింగుతావెందుకు? 
ఆయనేమో నిన్ను దగ్గరకి తీసుకుని, ఆపై నీతో జరిగే వేడుకకి ఎదురుచూస్తూ నిల్చున్నాడు.  

//చ// ఈ సమయంలో ఆయనకు నీ స్నేహాన్ని మాటి మాటికీ కొసరి చూపించవమ్మా! 
ఆయనకు వినపడేలా పలుమార్లు సణగవమ్మా!
శ్రీవేంకటేశ్వరుడు నీతో కూడి,  అనేక రతి విధానాలను బాగా మరిగి పరవశంతో, మధురమైన నిశ్వాసలను విడుచుచూ, బాగా అలసి ఉన్నాడు.